- ఆ పార్టీకి అనుకూలంగా ఈసీ నిర్ణయాలు ఉంటున్నాయని ఆరోపణ
- ఓటు రక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలె: డిప్యూటీ సీఎం భట్టి
న్యూఢిల్లీ, వెలుగు: ఎప్పటికీ అధికారంలో ఉండాలనే దురాశతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో ఓట్లను తొలగిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నారని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ విజయాల వెనక ఓట్ల చోరీ ఉందని ఆరోపించారు. సర్‌లో ఓట్ల తొలగింపుపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కానీ, బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.
ఓటు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అర్హులైన వారి పేర్లను జాబితాల నుంచి తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సవరణ పారదర్శకంగా జరగాలన్నారు. ఓట్ల తొలగింపుపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా రాజకీయ విధానాలకు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ల తొలగింపు: శ్రీధర్‌బాబు
సర్ ఉపసంహరించుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. గతేడాదిగా కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. జాబితాల సవరణ పారదర్శకంగా జరగాలని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పేర్కొంటూ, జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్‌లో ఓట్ల తొలగింపుపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఓటు హక్కును హరించే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని, దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
గాంధీ మార్గంలో పోరాటం : భట్టి విక్రమార్క
ఓటు హక్కును పరిరక్షించడమే తమ ఉద్యమ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈసీని అడ్డం పెట్టుకొని సర్ ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అర్హులైన పౌరుల హక్కులకు భంగం కలిగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రారంభించిన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతి పౌరుడు ఈ పోరాటంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అర్హులందరికీ ఓటు హక్కు కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని కోరారు. తమ నిరసనలు మహాత్మా గాంధీ చూపిన శాంతియుత మార్గంలో కొనసాగుతున్నాయని, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు ఉద్యమం: వాకిటి శ్రీహరి
ఈసీని అడ్డం పెట్టుకొని బీజేపీ దొడ్డిదారిన ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ఉద్దేశంతో కొన్ని వర్గాల ఓటర్ల పేర్లను జాబితాల నుంచి పెద్ద ఎత్తున తొలగించారని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రతి అర్హుడికి ఓటు వేసే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.
ఓట్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, సర్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రెండు డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
